రాష్ట్ర రాజధాని అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని హైకోర్టు పేర్కొన్నoదువల్లనే, రాజ్యాంగ పరంగా శాసనసభకు ఉన్న హక్కులను సాధించుకోవడం కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. శనివారం విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని, దానికి మరింత బలం చేకూర్చడం కోసం, రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను సాధించుకోవడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లామని ఆయన స్పష్టం చేశారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని ఈ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు తెలియజేశామని ఆయన చెప్పారు. రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం చట్టసభలకు లేదన్న అంశంపై.. దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అమర్నాథ్ అన్నారు.
258 ప్రకారం 2014లో అప్పటి ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తీసుకు వచ్చిందని, ఆ చట్టాన్ని మార్చే అధికారం ఈ ప్రభుత్వానికి లేదని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వెలుగు చూడకుండానే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు వేసింది ఎక్స్ పర్ట్ కమిటీ కాదు అని, అదొక నారా-నారాయణలకు చెందిన ఇన్వెస్ట్ మెంటు కంపెనీ అని మండిపడ్డారు.
శాసనసభ ఉనికినే ప్రశ్నించే విధంగా తీర్పులు వస్తే రాష్ట్ర ప్రగతికి విఘాతం ఏర్పడుతుందని అమర్నాథ్ తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే తపనతో సిఎం జగన్ ప్రయత్నాలు సాగిస్తుంటే, కేవలం అమరావతిలోని 29 గ్రామాల కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని కుట్రలు పన్నుతున్నారని అమర్నాథ్ మండిపడ్డారు.
Also Read: అమరావతి పాదయాత్రకు హైకోర్టు అనుమతి