Friday, April 26, 2024
HomeTrending Newsరాజ్యాధికారం కోసం కలిసి రండి: పవన్ పిలుపు

రాజ్యాధికారం కోసం కలిసి రండి: పవన్ పిలుపు

కాపు, తెలగ, ఒంటరి, బలిజలు ముందుకొస్తే తప్ప రాష్ట్రంలో మార్పు వచ్చే అవకాశం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. ‘మీరు ముందుకు వస్తేనే శెట్టి బలిజలు, తూర్పు కాపులు, కొప్పు వెలమలు కదులుతార’ని అన్నారు. అప్పుడే దళితులు, మైనార్టీల సాధికారత కూడా సాధ్యపడుతుందని అయన సూచించారు. దీనికోసం పెద్దన్న పాత్ర పోషించాలని కాపు, తెలగ, ఒంటరి, బలిజలకు పిలుపు ఇచ్చారు. దశాబ్దాలుగా అధికారం అనుభవిస్తున్న శక్తులను కూలదోసి కొత్త శక్తులు రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని, ఈ మార్పు అనేది ఉభయ గోదావరి జిల్లాలతోనే ముడిపడి ఉందని అన్నారు. ఇప్పటివరకూ అధికారంలేని వర్గాల సాధికారత కోసం అందరూ కలవాలని, బైటికి రావాలని, సమ సమాజం స్థాపించాలని విన్నవించారు. తుది శ్వాస వరకూ రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజమండ్రిలోని బాలాజీపేటలో జరిగిన బహిరంగసభలో పవన్ పాల్గొన్నారు.

ప్రజల కోసమే తాను పోరాటం చేస్తున్నానని, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం తన బాద్యత  అని పవన్ స్పష్టం చేశారు. ‘మీరు తొక్కే కొద్దీ లేస్తాం తప్ప వెనక్కు వెళ్ళే ప్రసక్తే లేద’ని అన్నారు.  సిఎం అయిన తరువాతే తనను ‘సిఎం సిఎం’ అని పిలవాలని, పవర్ తన చేతికి వచ్చేవరకూ పవర్ స్టార్ అని పిలవొద్దని అభిమానులకు సూచించారు. తన కోసమే తాను బతికేట్లయితే ఇన్ని తిట్లు భరించేవాడిని కాదని, వారిని నార తీసి కింద కూర్చోపెట్టేవాడినని, కానీ అభిమానుల కోసం భరిస్తున్నానని అన్నారు. తన సహనాన్ని పిరికితనంగా భావించవద్దని, ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు.

రోడ్లు బాగాలేకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని, దీనిపై కెమెరా, యాక్షన్, స్టార్ట్ అంటూ సజ్జల మాట్లాడడం సరైంది కాదని పవన్ అన్నారు. బలమైన వ్యక్తిని కాబట్టే తనను లక్ష్యం చేసుకున్నారని, వైసీపీ పాలనలో ఎవరికీ హక్కులు లేకుండా పోయాయని అన్నారు.  ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని అన్నిటికీ తెగించే రాజకీయాలోకి వచ్చానన్నారు.  వచ్చే ఎన్నికలో జనసేన విజయం సాదిస్తుందని అయన ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయం తనకు సరదా కాదని, ప్రాణం పోయినా సరే రాజకీయాలను వదులుకొనే ప్రసక్తే లేదని పవన్ తేల్చి చెప్పారు.  కులాల పేరుతో  రాజకీయం చేస్తున్నారని, ప్రభుత్వం ఒక కులాన్ని వర్గ శత్రువుగా భావించడం సరైంది కాదని, అన్ని వర్గాలకు, కులాలకు సాధికారత రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కమ్మ కులానికి వ్యతిరేకం కాదని చెప్పడానికే నాడు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చానని పేర్కొన్నారు.

వైసీపే నేతలు తనపై మానసిక అత్యాచారం చేశారని, వారు ఇకపై యుద్ధానికి సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ సుదీర్ఘ యుద్ధంలో తన ప్రాణాలు పొతే తన మట్టిని దేశం నలుమూలలా చల్లాలని అభిమానులకు భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. ఆ మట్టి నుంచే అన్యాయాన్ని, దాష్టీకాన్ని ఎదిరించే కత్తులు మొలవాలని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్