Sunday, May 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంన బూతో న భవిష్యతి

న బూతో న భవిష్యతి

Real ‘Fake’ Calls:

సన్నివేశం-1

ప్రజా ప్రతినిధి:-
ఏమిరా! నకరాలు చేస్తున్నావా? కాళ్లు విరగ్గొడతా. ఏమనుకుంటున్నావో!

అధికారి:-
సార్…సార్…సార్…నా కాళ్ల మీద నేను నిలబడలేని వాడిని. తకరారులు, నకరాలు, కారాలు మిరియాలు నూరేంత…నకిలీలు చేసేంత శక్తి లేనివాడిని…

ప్ర. ప్ర:-
అంటే నేను చేసే వాడిననేగా నీ ఉద్దేశం? పళ్ళూడగొడతారా బిడ్డా!

అ:-
బిడ్డలున్నవాడిని సార్… నా పళ్లు నా నోట్లో ఉండనివ్వండి సార్.

ప్ర. ప్ర:-
అంటే నాకు బిడ్డల్లేరనేగా నీ దెప్పి పొడుపు? చంపేస్తానురా నిన్ను.

:-
అసలే బిక్కచచ్చి ఉన్నవాడిని. ఆత్మాభిమానాన్ని చంపుకుని బతుకుతున్నవాడిని. చావలేక బతుకుతున్నవాడిని. బతకలేక చస్తున్నవాడిని… నన్ను ఇంకా ఇంకా చంపకండి సార్.

ప్ర. ప్ర:-
ఏమిరా! నోరు లేస్తోంది? నన్ను హంతకుడంటావా?

అ:-
నేనెప్పుడన్నాను సార్?

ప్ర. ప్ర:-
నీ బిక్కచావు, ఆత్మ చావు, సగం చావు, ముప్పావు చావు…అన్ని చావులకు నేనే కారణం అంటున్నావు కదా? నాకు తెలియదనుకుంటున్నావా? తెలుగు రాదనుకుంటున్నావా బే?

అ:-
సార్…సార్…సార్…మీకు తెలుగుతో పాటు భాషలన్నీ తెలుసు. నాకే తెలుగు మాట్లాడ్డం రాక…

ప్ర. ప్ర:-
అదీ…కొడకా! అలా రా…దారికి. ఒరేయ్! నేను మొన్న కార్లో పోతుంటే నువ్ కుర్చీలోంచి లేవలేదెందుకురా?

అ:-
సార్…మీరు ఏ కారులో ఉన్నారో తెలియలేదు సార్. ముందు పది కార్లు వెళ్ళినప్పుడు కారు కారుకు లేచి కూర్చున్నా.

ప్ర. ప్ర:-
రేయ్! కారు కూతలు కూయకు. నాకు ప్రోటోకాల్ ముఖ్యం. నా పంతం నీకు తెలియదు. నీ అంతు చూస్తా.

అ:-
సార్…నాకెందుకు పంతాలు? నేను ఎప్పుడో అంతమై ఉన్నవాడిని. పతనం అంచునే ఉన్నాను.

ప్ర. ప్ర:-
నన్నే అంతం చేస్తావా? ఎంత ధైర్యం రా…నీకు? వస్తున్నా…అక్కడే ఉండు.
….బూతు….బూతు
…పచ్చి బూతు
…పండు బూతు
…బండ బూతు
…ఎండు బూతు
…రాయడానికి వీల్లేని నానా బూతులు.

ప్ర. ప్ర:-
ఏమిరా! రిప్లై లేదు?

అ:-
ఇసుకవేస్తే రాలనంతగా తిట్లు తిట్టి…సౌండ్ లేదంటారేమిటి సార్?

ప్ర. ప్ర:-
అంటే…నేను అక్రమంగా ఇసుక తవ్వి, దౌర్జన్యంగా ఇసుక అమ్ముకుని, ఆబగా ఇసుక తిని, ఉన్మాదిలా ఇసుక ఉమ్ముతున్నాననే కదా నీ డబుల్ మీనింగ్ వ్యంగ్యం?

అ:-
సార్…నాకు నిజంగా డబుల్ మీనింగ్ భాష వచ్చి ఉంటే…హాయిగా తెలుగు సినిమాల్లో పాటలు రాసుకుంటూ ఉండేవాడిని. ఈ అడ్డమయిన ఉద్యోగం ఎందుకు చేసేవాడిని?

ప్ర. ప్ర:-
బాడ్కో…నన్ను అడ్డ గాడిద అంటావా?

అ:-
నేనెప్పుడన్నాను సార్?

(మృదువయిన ఈ సుహృద్భావ సంభాషణ అనంతం…)

సన్నివేశం-2

విలేఖరి:-
సార్! మీరు ఆ అధికారిని అమ్మనా బూతులు తిట్టారట?

ప్ర. ప్ర:-
ఆయనంటే నాకు అపారమయిన గౌరవం. మా డ్రైవర్ ప్రియురాలి ప్రియాతి ప్రియమయిన పెంపుడు పిల్లి తప్పిపోతే…వెతికి పెట్టాల్సిందిగా అభ్యర్థించడానికే ఫోన్ చేశాను. ముఖ్యమంత్రి పర్యటనలో బిజీగా ఉన్నా…ఖచ్చితంగా వెతికి పెడతానన్నాడు…అంతే…

Political Leaders Dirty Language

వి:-
మరి మీడియాలో వినపడుతున్న మీ నానా బూతులు?

ప్ర. ప్ర:-
ఆ ఆడియో నాది కాదు. ప్రతిపక్షాల కుట్ర. నా ఎదుగుదల చూసి ఓర్వలేని వారి కుట్ర.

వి:-
మీరు తిడుతుండగా చూసినవారున్నారు?

ప్ర. ప్ర:-
లోకం గుడ్డిది తమ్మీ.

వి:-
విన్నవారున్నారు?

ప్ర. ప్ర:-
అన్నీ విచారణలో తేలుతాయి. అప్పుడు సత్యహరిశ్చన్ద్రుడు…ఇప్పుడు నేను…ఇద్దరమే సత్యానికి కట్టుబడింది.

Political Leaders Dirty Language

సన్నివేశం-3

పార్టీ ఆఫీసులో రహస్య సమావేశం జరుగుతోంది. సదరు ప్రజా ప్రతినిధిని పార్టీ మందలించినట్లుగా మీడియాలో లీకులు వస్తున్నాయి.

అదే సమయానికి లోపల పార్టీ పెద్దలు అధికారులను ఎలా బెదిరించాలో? ఎన్నెన్ని బూతులతో ఎలా అనర్గళంగా తిట్టాలో ఈ ప్రజాప్రతినిధి దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

దేవుడికన్నా దెబ్బే గురువు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్