సిఎం జగన్ అన్ని మతాలనూ ఆదరిస్తారని, ప్రేమిస్తారని దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి సంప్రదాయాలను విధిగా పాటిస్తారని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. దేవుడి దయతోనే ఇన్ని మంచి పనులు ప్రజలు చేయగాలుగుతున్నామని అయన ఎప్పుడూ చెబుతుంటారని, అలాంటి సిఎం జగన్ పై అనవసర నిందలు వేయడం సమంజసం కాదని కోన వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వినాయకచవితి పండుగపై ఆంక్షలు విధించారంటూ తెలుగుదేశం, బిజెపి చేస్తున్న విమర్షలను రఘుపతి తీవ్రంగా ఖండించారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు మర్చిపోయినట్లున్నారని, వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 23 స్థానాలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితికి దిగజారుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో రెండు బిజెపిలు ఉన్నాయని ఒకటి టిడిపి బిజెపి కాగా, రెండవది అసలు బిజెపి అని రఘుపతి ఎద్దేవా చేశారు. బిజెపిలో ఉంటూ టిడిపి ప్రయోజనాల కోసమే కొంతమంది పనిచేస్తున్నారని ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని రఘుపతి హితవు పలికారు. ఇలాంటి వారిని కట్టడి చేయకపోతే కేంద్రంలో మోడీకి ఎంత మంచి పేరు వచ్చినా ఈ రాష్ట్రంలో బిజెపి ఎదగడం కలగానే ఉంటుందన్నారు.
వినాయకుడి ఉత్సవాలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకపోయినా, గతంలో ఉన్న నిబంధనలు తమ ప్రభుత్వం పెట్టినట్లు దుష్ప్రచారం చేస్తూ సిఎం జగన్ ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తున్నారని ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని రఘుపతి హెచ్చరించారు.