కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తల్లి పౌలా మైనో కన్నుమూశారు. ఆగస్టు 27న ఇటలీలోని తన నివాసంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. మంగళవారం పౌలా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ విభాగం ఇంఛార్జ్ జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా బుధవారం వెల్లడించారు. సోనియా గాంధీ మాతృమూర్తి పౌలా మైనో వయసు 90 ఏళ్లు పైనే ఉంటుంది. వయసుపై బడటం వల్ల కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో మంచానపడ్డ తల్లిని చూసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆగస్టు 23న ఇటలీ వెళ్లారు.
కుమారుడు రాహుల్‌గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీ కూడా అమ్మమను చూసేందుకు తల్లి సోనియా వెంట వెళ్లిన విషయం తెలిసిందే. పౌలా మైనో మరణంపై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో సంతాపం తెలియజేసింది. ‘కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో మరణంపై కాంగ్రెస్ కుటుంబం ప్రగాఢ సంతాపం తెలుపుతోంది.. మరణించిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మా సంఘీభావం తెలియజేస్తున్నాం’ అని పేర్కొంది.