సెప్టెంబరు ఆరో తేది నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 6న ఉదయం 11.30 గంటల నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తారు. అసెంబ్లీ నిర్వహణతో పాటు పలు అంశాలపై ఇందులో చర్చిస్తారు. గడిచిన అసెంబ్లీ సమావేశాలు ఈ ఏడాది మార్చి 7 నుంచి 15 వరకు జరిగాయి. అనంతరం వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు జరగలేదు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా ఒకరోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించాలనుకున్నా.. ఆ ఆలోచనను ఉపసంహరించుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి సభ సమావేశం కావాలి. ఈ దృష్ట్యా చూస్తే మార్చి 15తో గత సమావేశాలు ముగిశాయి. అందువల్ల సెప్టెంబరు 6న సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేయాలనే టీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీహార్ పర్యటనలో కూడా సీఎం కేసీఆర్ ఇదే అంశంపై మాట్లాడారు. అలాగే ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం సూచించడంపై ఈ సమావేశాల్లో చర్చించనుంది.