త్వరలో మునుగోడు ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అభ్యర్థి అంశంపై జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో టెన్ జన్ పథ్ లోని సోనియాగాంధీ నివాసంలో ఈ రోజు సమావేశమయ్యారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ సమక్షంలో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు మునుగోడు ఉపఎన్నికపై చర్చించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీలో పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న పార్టీ పదవులపై ప్రియాంక గాంధీతో చర్చించామన్నారు. పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేత అని మా పార్టీ కార్యకర్త. ఆయన సమయాభావం వల్ల సమావేశానికి రాలేదన్నారు
వెంకటరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సమావేశంలో చర్చ జరిగిందని, అతి త్వరలోనే రాష్ట్ర ముఖ్యనేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలుస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థిని ఖరారు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ పై కూడా అధిష్ఠానంతో చర్చించామని, పార్టీలో క్రమశిక్షణతో మెలగాలని అధిష్టానం కోరిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగిందని, కాంగ్రెస్ నేతలంతా సమిష్టిగా మునుగోడులో పని చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మరో వైపు రేవంత్ రెడ్డి తనను అవమానపరుస్తున్నందునే సమావేశానికి హాజరు కాలేదంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియాగాంధీకి లేఖ రాశారు. ఎలాంటి సమాచారం లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తూ తన అనుచరలతో అవమానకరంగా మాట్లాడిస్తున్నారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే తాను ప్రియాంకగాంధీతో సమావేశానికి హాజరుకాలేకపోయినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో జరిగిన సమావేశంలో క్రమశిక్షణ, కోమటిరెడ్డిని బుజ్జగించే అంశాలపై ప్రధానంగా ద్రుష్టి సారించినట్టు సమాచారం. షరామాములుగానే సమావేశం జరిగిందని పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. గ్రూపు రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలతో పార్టీ నష్టపోతున్న అంశాలు పట్టించుకున్న దాఖలాలు లేవని అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
Also Read : బిజెపి, తెరాసల ఫిరాయింపు రాజకీయాలు రేవంత్ రెడ్డి