Saturday, January 18, 2025
HomeTrending Newsఉత్తరాంధ్ర ప్రజలు మేల్కోవాలి: రౌండ్ టేబుల్ పిలుపు

ఉత్తరాంధ్ర ప్రజలు మేల్కోవాలి: రౌండ్ టేబుల్ పిలుపు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన అధికార వికేంద్రీకరణను ఉత్తరాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో స్వాగతించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి ఎటువంటి ఉద్యమాలు చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తరాంధ్రకు చెందిన మేధావులు, ఉద్యోగులు, రచయితలు, కార్మిక సంఘాల నేతలు, వివిధ వర్గాలకు చెందిన నాయకులు స్పష్టం చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక గాదిరాజు ప్యాలస్ లో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్ద సంఖ్యలో  ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ  రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సిఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రంలోని ఐదు కోట్ల మందికి అభివృద్ధి ఫలాలు అందాలన్నది ఆయన ఆకాంక్ష అని అన్నారు. చంద్రబాబు మాదిరి వ్యక్తిగత నిర్ణయాలు కాకుండా, మేధావులతో చర్చించి మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతిలోని 29 గ్రామాలకు జగన్ వ్యతిరేకం కాదని, 26 జిల్లాల అభివృద్ధి ఆయన లక్ష్యమని అన్నారు.

29 గ్రామాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వారి ఎజెండాను 26  జిల్లాల ప్రజలకు ముడిపెట్టి యాత్ర చేయడం సరికాదని బొత్స అన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన వెనుక ఉన్న వ్యక్తుల కోసం ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటా మంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. మూడు రాజధానులు వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్పాలని అమరావతి రైతులను మంత్రి ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కీడు తలపెడుతున్న చంద్రబాబునాయుడు చర్యల పట్ల మాట్లాడకుండా ఉండి, మరోసారి నష్టపోవడానికి తాము సిద్ధంగా లేమని బొత్స స్పష్టం చేశారు. ఈ దశలో మంత్రి బొత్స ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా మేల్కొని, నష్ట నివారణకు గళమెత్తాలని అని ఆయన పిలుపునిచ్చారు. జనం రోడ్ల మీదికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. సంఘటితంగా, శాంతియుతంగా చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, రాజకీయ ఎజెండాతో సాగుతున్న యాత్ర రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదని అన్నారు. దీన్ని ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని, రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజల మనోభావాలను మన్నించి యాత్ర విరమించుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్ర గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందని, సంక్షేమం, అభివృద్ధి గురించి ఏ మాత్రం పట్టని చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలనే లక్ష్యంతోనే ఈ యాత్ర చేయిస్తున్నాడని ఆయన విమర్శించారు.  ఇక్కడి ప్రజలు ఎప్పటికప్పుడు చంద్రబాబునాయుడు కుట్రలను గమనిస్తున్నారని ఆయన అన్నారు. అన్ని హంగులు వున్న విశాఖ నగరాన్ని పాలనా రాజధానిగా చేస్తే, వచ్చే నష్టమేమిటో చంద్రబాబునాయుడు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే వాస్తవాల్ని ప్రజలందరికీ వివరిస్తామని ఆయన చెప్పారు.

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రం నలుమూలలా అభివృద్ధిని కాంక్షించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారని,  దాన్ని అడ్డుకోవటం చంద్రబాబుకు తగదని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు శాంతికాముకులని వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తే, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్ మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణ అంశాన్ని అప్పట్లో పంచవర్ష ప్రణాళిక లోనే పొందుపరిచారని గుర్తుచేశారు. విశాఖకు చారిత్రక నేపథ్యం ఉందని, రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే రాజధానికి సరైన ప్రదేశం విశాఖ అని ఆయన చెప్పారు. ఏయూ మాజీ వైస్ ఛాన్సలర్ బాల మోహన్ దాస్ మాట్లాడుతూ, అమరావతి రాజధానిగా పనికి రాదని, వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించినట్లు ఆయన గుర్తు చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే, గ్లోబల్ సిటీ గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ అన్ని మతాల వారికీ, అన్ని వర్గాల వారికీ విశాఖపట్నం సురక్షితమైన ప్రదేశమని అందువల్ల ఇక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పైగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన విశాఖకు రాజధాని వస్తే అనింది పరిశ్రమలు ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

జర్నలిస్ట్ శివ శంకర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇచ్చే దరిద్రానికి నెలవుగా మారిందని ఉద్యోగాలు లేక అనేక మంది ఇక్కడి నుంచి వలస పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని పూర్తిస్థాయిలో నిర్మించాలంటే 50 ఏళ్లు పడుతుందని వికేంద్రీకరణ ద్వారా సత్వర అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పా రు. ఉత్తరాంధ్ర లోని అన్ని ప్రాంతాల్లో ఇటువంటి సమావేశం నిర్వహించి వికేంద్రీకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

జర్నలిస్ట్ గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ పరిపాలన రాజధాని విశాఖ తీసుకువస్తే విశాఖ నగరం మరింత సుందరంగా మారుతుందని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలను దెబ్బ కొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విశాఖ ప్రజల గుండెల మీద కవాతు చేయడానికి అమరావతి రైతులు వస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు విశాఖ ప్రజలు వేలాది ఎకరాల భూములు ఇచ్చారని, వారు ఇప్పటికీ ఎటువంటి లబ్ధి ఆశించడం లేదని అన్నారు. ఉత్తరాంధ్రను పాలనా రాజధాని చేయడానికి ఎటువంటి ఉద్యమానికైనా తాము సిద్ధంగా ఉన్నామని కొయ్య ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నాయకులు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ వికేంద్రీకరణ కు అందరూ మద్దతు ఇవ్వాల్సిందేనని అన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, రాజధాని నిర్ణయించే అధికారం  రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విశాఖ పట్టణాన్ని పాలనా రాజధానిగా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ సత్యవతమ్మ, జి.మాధవి, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, భాగ్యలక్ష్మి, ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబురావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి కేకే రాజు, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, వరుదు కళ్యాణి, వీఎంఆర్డీఏ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also Read వచ్చే ఏడాది నుంచి విశాఖ ‘పరిపాలన’: గుడివాడ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్