Sunday, September 8, 2024
Homeసినిమాజల్సాగా బ్రతకాలనుకున్న బస్తీ కుర్రాళ్ల కథనే 'ATM'

జల్సాగా బ్రతకాలనుకున్న బస్తీ కుర్రాళ్ల కథనే ‘ATM’

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వరుస వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి. సీజన్స్ వారీగా వదులుతున్న కంటెంట్ లో సాధ్యమైనంత కొత్తదనం ఉండేలా చూస్తున్నాయి. ఇతర భాషల్లో రూపొందిన వెబ్ సిరీస్ లు కూడా తెలుగులో అందుబాటులో ఉంటూ ఉండటంతో, తెలుగు వెబ్ సిరీస్ ల క్వాలిటీ విషయంలో రాజీపడనీ పరిస్థితి నెలకొంది. వెబ్ సిరీస్ లకు కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంటులు .. ప్రీ లాంచ్ ఈవెంటులు పెట్టేస్తున్నారు. తాజాగా జీ 5వారు ‘ATM’ అనే వెబ్ సిరీస్ ను నిన్న స్ట్రీమింగ్ చేశారు.

వీజే సన్నీ .. సుబ్బరాజు .. పృథ్వీ పాత్రలు ప్రధానంగా ఈ వెబ్ సిరీస్ నడిచింది. హరీశ్ శంకర్ కథను అందించిన ఈ వెబ్ సిరీస్ ను దిల్ రాజు తన పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన బ్యానర్లో నిర్మించాడు. చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ఫస్టు సీజన్ పేరుతో 8 ఎపిసోడ్స్ ను వదిలారు. హైదరాబాదులోని ఒక మురికివాడకి చెందిన నలుగురు యువకులు, జల్సాగా బ్రతకాలనుకుంటారు. అందుకోసం ఒక దొంగతనం చేసి ఒక రౌడీ షీటర్ కి దొరికిపోతారు. 10 రోజుల్లో అతనికి 10 కోట్లు ముట్టజెబుతామని అక్కడి నుంచి బయటపడతారు.

ఆ డబ్బుకోసమే 25 కోట్లతో బయల్దేరిన ‘ATM’ వ్యాన్ ను కొట్టేస్తారు. ఈ కేసును డీల్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ గా సుబ్బరాజు రంగంలోకి దిగుతాడు. ఇక ఎమ్మెల్యే గా ఎదగాలనుకున్న పృథ్వీ ఏరియాకు సంబంధించినవారే ఆ నలుగురు యువకులు. వాళ్లు కొట్టేసిన డబ్బును తాను దక్కించుకోవడానికి అతనొక మాస్టర్ ప్లాన్ వేస్తాడు.  ఇలా ఒక వైపున రౌడీ షీటర్ .. మరో వైపున పృథ్వీ .. ఇంకో వైపున సుబ్బరాజు .. పరారీలో ఉన్న నలుగురు యువకుల చుట్టూ ఈ కథ నడుస్తుంది.

హరీశ్ శంకర్ అందించిన కథ అంత గొప్పగా ఏమీ అనిపించదు. అలాగే నిర్మాణ విలువల పరంగా కూడా ఓ మాదిరిగానే కనిపిస్తుంది. దర్శకత్వం పరంగా చూసుకుంటే, సన్నివేశాలు చాలా స్లోగా నడుస్తూ ఉంటాయి. కొన్ని పాత్రలను సరిగ్గా డిజైన్ చేసుకోలేదనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతోందనే ఆసక్తిని కలిగించలేకపోయారు. సుబ్బరాజు పాత్ర ఎంటరైన తరువాత నుంచి ఫరవాలేదు. ఆయన యాక్షన్ మాత్రం ఆకట్టుకుంటుంది. చివరి ఎపిసోడ్ లో తలెత్తిన కొన్ని ప్రశ్నలకు సీజన్ 2లో సమాధానాలు దొరకనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్