Friday, April 19, 2024
HomeTrending Newsగోదావరి నదిపై మరో రోడ్డు కం రైలు వంతెన : ఎంపీల వినతి

గోదావరి నదిపై మరో రోడ్డు కం రైలు వంతెన : ఎంపీల వినతి

రాజమండ్రి-కొవ్వూరును కలుపుతూ నిర్మించిన రోడ్డు కం రైలు వంతెన ప్రస్తుతం జీర్ణావస్థకు చేరుకుని ప్రమాదపు అంచున ఉందని, దాని స్థానంలో మరో కొత్త రోడ్డు కం రైలు వంతెన నిర్మించవలసిందిగా రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. రైల్వే శాఖ మంత్రిని స్వయంగా కలిసి ఇందుకు సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రికి ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్న రోడ్డు కం రైలు వంతెన పరిస్థితిని గూర్చి సమగ్రంగా ఎంపీ భరత్ వివరించారు. ఈ వంతెనను 1970లో జెస్సోప్ కనస్ట్రక్షన్ కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభించిందని, 1974 ఆగస్టు16న అప్పటి భారత రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ చే ప్రారంభించినట్టు తెలిపారు. ఆసియాలోనే మూడవ అతి పెద్ద రైల్వే వంతెనగా పేరుగాంచిందన్నారు. రాజమండ్రి- కొవ్వూరులను కలుపుతూ గోదావరి నదిపై 4.1 కిలోమీటర్ల పొడవు వంతెన రాష్ట్రంలోనే ఎంతో అందమైన వంతెనగా గుర్తించబడిందని, అయితే దాని జీవితం సుమారు 46 సంవత్సరాలు కావడంతో ఆ సమయం మించిపోయిందన్నారు. గత 48 సంవత్సరాలుగా రైల్వే, ఆర్ అండ్ బీ శాఖలకు విశేషమైన సేవలందించిందని చెప్పారు. ప్రస్తుతం ఈ వంతెనకు పలుచోట్ల హ్యాండ్ రైల్స్, పుట్ పాత్ లు దెబ్బతిన్నాయని, ఉక్కు మార్గాలు కూడా దెబ్బతిన్న విషయాన్ని రైల్వే అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు గుర్తించారన్నారు. వంతెనకు ఇరువైపులా మొత్తం ఉక్కు మార్గాలను 2.928 కిలోమీటర్ల పొడవునా తక్షణమే మార్చాలని మంత్రికి ఎంపీ భరత్ వివరించారు. అనేక ప్రదేశాలలో పుట్ పాత్ లు కూలిపోయాయని చెప్పారు.

గతంలో లాక్ డౌన్ సమయంలో దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టినా, అలాగే ఆర్ అండ్ బీ అధికారులు అనేక సార్లు మరమ్మతు పనులుచేసినా ఫలితం లేకపోయిందని మంత్రికి తెలిపారు. ఏ సమయంలో ఏ ఉపద్రవం తెస్తుందోననే భయం వాహనదారులు, ప్రయాణికులలో ఉందన్నారు. పూర్వపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు ఈ వంతెనే ప్రధానమని, ప్రస్తుతం జీర్ణావస్థకు చేరిన రోడ్డు కం రైలు వంతెనకు బదులు మరొక   రోడ్డు కం రైలు వంతెన నిర్మించడం చాలా అవసరమని ఎంపీ భరత్ తెలిపారు. రైల్వే ట్రాఫిక్ సమస్యలు నివారించడానికి కొత్త వంతెన (రోడ్డు కం రైలు వంతెన) చాలా అవసరమని భరత్ కోరారు. అలాగే అనపర్తి, నిడదవోలు రైల్వేస్టేషన్లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ హాల్ట్ లకు తగు నిర్ణయం తీసుకోమని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. భరత్ తోపాటు కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్ కూడా కేంద్ర మంత్రిని కలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్