Saturday, January 18, 2025
HomeTrending Newsవిష వ్యాఖ్యలతో విద్వేషపు మంటలు - కెసిఆర్

విష వ్యాఖ్యలతో విద్వేషపు మంటలు – కెసిఆర్

దేశంలో, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయన్నారు. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని మతోన్మాద శక్తుల చేతుల్లోకి వెళ్లనీయొద్దని ప్రజలను కోరారు. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదని, మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం, రాష్ట్రం జీవికనే కబళిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ సంబంధాలనే మంట గలుపుతుంది. జాతి జీవనాడిని కలుషితం చేస్తుందన్నారు.

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రసంగం…

జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయి. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు, ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. అదే క్రియాశీలతను, బుద్ధి కుశలతను మరోమారు చూపించాలి. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోమారు హెచ్చరిస్తున్నాను.

యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా, ప్రతి హృదయంలో భారతీయతా భావన ఉప్పొంగేలా 15 రోజులపాటు అద్భుతంగా జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నాం.

తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం మనందరికీ సువిదితమే. నాడు అవలంబించిన అనేక వ్యూహాలు, జరిపిన పోరాటాలు, నెరపిన త్యాగాలలో నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయింది.
ఆనాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్విగ్నపరుస్తూనే ఉంటాయి. యావత్ సమాజం పోరాడిన సందర్భంలో ఆ సన్నివేశానికి కొందరు నాయకత్వం వహించడం ప్రపంచ పోరాటాలన్నింటిలో కనిపించేదే. తెలంగాణలో సైతం ఆనాడు ఎందరో యుద్ధం చేశారు. ఇంకొందరు ఆ యుద్ధానికి నాయకత్వం వహించారు. మరికొందరు సాంఘిక, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించారు. నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం
ఆదిలాబాద్ అడవుల్లో తుడుం మోత మోగించి, అడవిబిడ్డలను ఒక్కటి చేసి, జల్ జంగల్ జమీన్ కోసం సింహగర్జన చేసిన ఆదివాసి యోధుడు కొమరం భీమ్ సాహసాన్ని సగర్వంగా తలుచుకుందాం.
భూస్వాముల ఆగడాలకు బలయి పోయిన దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకుందాం. తన సొంత భూమి వందల ఎకరాలను పేద ప్రజలకు పంచిన త్యాగశీలి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వీరాగ్రేసరుడు, మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ కన్నా అత్యధిక మెజారిటీని సాధించిన మహా నాయకుడు రావి నారాయణరెడ్డికి ఘనమైన నివాళులర్పిద్దాం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో రాజకీయాల్లో అడుగిడి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను స్థాపించి,ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దిన స్వామి రామానంద తీర్థను స్మరించుకుందాం. తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయ స్థాపనను యజ్ఞంలా నిర్వహిస్తూ, కఠోరమైన జైలు శిక్షలకు వెరవకుండా మొక్కవోని ధైర్యంతో పోరాడిన సర్దార్ జమలాపురం కేశరావు, వట్టికోట ఆళ్వార్ స్వామిల కృషిని కొనియాడుదాం.
భూపోరాటాలకు గొప్ప ప్రేరణనిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆవాహన చేసుకుందాం. ఐలమ్మ పోరాటానికి దన్నుగా నిలిచి, ఉద్యమాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త, వందలాది ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాది, మచ్చలేని మహానాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డిని సవినయంగా స్మరించుకుందాం. జనగామసింహంగా పేరు గాంచిన నల్లా నర్సింహులునూ, జీవితాంతం పీడిత ప్రజల గొంతుకగా నిలిచి, గీత కార్మికుల అభ్యున్నతికోసం జీవితాన్ని అంకితం చేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ నూ, ప్రజా పోరాటానికి సేనానిగా నిలిచిన వీర యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి ఆరుట్ల కమలాదేవిల త్యాగాలను సదా స్మరించుకుందాం. పోరాటంలో పాలుపంచుకోవడమే కాకుండా ఆ పోరాట చరిత్రను గొప్పగా రికార్డు చేసిన దేవులపల్లి వేంకటేశ్వర రావుతో పాటు
అట్టడుగు వర్గాల మేలు కోరిన ఉద్యమకారుడిగా, పార్లమెంటేరియన్ గా, శాసనసభ్యుడిగా ఎనలేని సేవలు అందించిన బద్దం ఎల్లారెడ్డి చైతన్యాన్ని పుణికిపుచ్చుకుందాం. నిర్బంధాలకు ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్య మూర్తులు సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండియాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతుల రచనల్లోని ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నిరంతరం నిలబెట్టుకుందాం. ఇంకా ఎందరో మహానుభావులు, తెలంగాణ సమాజంలో అద్భుతమైన రాజకీయ, సామాజిక చైతన్యాన్ని రగిలించారు తమ త్యాగాలతో చరిత్రను వెలిగించారు. వారందరి ఉజ్వల స్మృతికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.


భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రంగా వెలుగొందింది. శ్రీబూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రం కొనసాగింది. మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని, అడుగులు వేయటం ప్రారంభించింది. 1956లో దేశంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా.. తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ-ఆంధ్రలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుండి తెలంగాణ ప్రజలలో తాము మోసపోయినామనీ, తాము దోపిడీకి గురువుతున్నామనే ఆందోళన గూడు కట్టుకుంది. ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు. సఖ్యత ఏర్పడలేదు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం అందుకు భిన్నంగా సాచివేత ధోరణిని అవలంభించింది.
తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలికొదిలేసింది. తెలంగాణ ప్రజలు భయపడినట్లుగానే సమైక్య రాష్ట్రంలో అన్నిరంగాల్లో దారుణమైన వివక్ష అమలైంది. ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది.
2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించి, ఉద్యమశంఖం పూరించాను. తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటిచేసి, పధ్నాలుగేళ్లు అవిశ్రాంత పోరాటాన్ని నడిపించాను. లక్ష్య సాధన కోసం మరణం అంచులదాకా వెళ్లేందుకు సిద్ధపడ్డాను. తెలంగాణ ఉద్యమం అంతకంతకూ తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రజా ఉద్యమం ఆశించిన గమ్యాన్ని ముద్దాడింది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది.
తెలంగాణ ఏవిధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో, సంభావించారో.. అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది.
రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమించి.. దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ గా నిలిచింది.

పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా తెలంగాణ అలరారుతున్నది. సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తున్నది. ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి.
ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, వాటిలోని మంచి చెడులను అర్ధం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి. ఏ కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణే మనకు ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించింది. తాను కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎంతోమంది జైలుపాలు కావలసి వచ్చింది, ఎన్నోజీవితాలు ఆహుతై పోవాల్సి వచ్చింది. ఆ చరిత్రంతా నేను వేరే చెప్పనక్కరలేదు. అది మనందరి ప్రత్యక్ష అనుభవం. సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమందరం ప్రత్యక్ష భాగస్వాములమే.
హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలచుకుంటే నేటికీ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి.

మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేల పై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా.. ప్రతీ క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటికి మించి మీ బిడ్డగా ఈ విషయం మీకు చెప్పడం నా కర్తవ్యం. నా గురుతర బాధ్యత.

Also Read : 

తెలంగాణ జన్మ నక్షత్రం

RELATED ARTICLES

Most Popular

న్యూస్